
ఎముక (Bone) అనగా సకశేరుకాల (వెన్నెముక గల జంతువులు) శరీరంలో ఉండే ఒక దృఢమైన అంగం. ఇవి కలిసి అస్థిపంజర వ్యవస్థ (Skeletal system) ను ఏర్పరుస్తాయి. దేహానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇవ్వడంతో పాటు లోపలి సున్నితమైన అవయవాలకు రక్షణ కల్పిస్తాయి. ఎముకలు రకరకాల పరిమాణాల్లో, ఆకారాలలో ఉంటాయి. సాధారణంగా ఒక వయోజన మానవుని శరీరంలో 206 ఎముకలు ఉంటాయి, అయితే పుట్టినప్పుడు శిశువుల శరీరంలో సుమారు 300 వరకు ఎముకలు ఉంటాయి (పెరిగే కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి).
ఎముకల విధులు
- ఆధారం, ఆకారం: ఎముకలు శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని, దృఢమైన ఆధారాన్ని ఇస్తాయి.
- రక్షణ: మెదడు (కపాలం ద్వారా), గుండె మరియు ఊపిరితిత్తులు (పక్కటెముకల ద్వారా) వంటి అత్యంత సున్నితమైన అవయవాలను ఎముకలు రక్షిస్తాయి.
- కదలిక: కండరాలతో కలిసి ఎముకలు కీళ్ల ద్వారా శరీర కదలికలకు సహాయపడతాయి.
- రక్త కణాల ఉత్పత్తి: పొడవైన ఎముకల లోపల ఉండే ఎముక మూలుగ లేదా అస్థిమజ్జ (Bone marrow) లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు ఉత్పత్తి అవుతాయి.
- ఖనిజాల నిల్వ: ఎముకలు క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలకు నిల్వ కేంద్రాలుగా పనిచేస్తాయి. రక్తంలో క్యాల్షియం స్థాయిలు తగ్గినప్పుడు ఎముకలు క్యాల్షియంను విడుదల చేస్తాయి.
ఎముకల నిర్మాణం
ఎముక ప్రధానంగా క్యాల్షియం ఫాస్ఫేట్ అనే ఖనిజంతో, కొల్లాజెన్ అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుంది. ఎముక వెలుపలి పొర చాలా గట్టిగా (Compact bone), లోపలి పొర స్పాంజిలా (Spongy bone) ఉంటుంది.
మానవ శరీరంలోని ముఖ్యమైన ఎముకలు
- 1-4 - కపాలం (Skull)
- 5, 6 - జంభిక
- 7 - హనువు (దగ్గరి దవడ ఎముక)
- 8 - మెడ వెన్నెముకలు
- 9 - నాసికాస్థులు (ముక్కు ఎముకలు)
- 10 - ఉరోస్థి (ఛాతీ మధ్యలో ఉండే ఎముక)
- 11 - దండ ఎముక (Humerus)
- 12 - అరత్ని (Radius)
- 13 - రత్ని (Ulna)
- 14 - కటి వెన్నెముకలు
- 15 - శ్రోణి మేఖల (కటి వలయం)
- 16 - త్రికాస్థి
- 18 - తుంటి ఎముక (Femur - శరీరంలో అతి పొడవైన, బలమైన ఎముక)
- 19 - జానుఫలకము (మోచిప్ప - Patella)
- 20 - అంతర్జంఘిక (Tibia)
- 21 - బహిర్జంఘిక (Fibula)
- 25 - జత్రుక (Collar bone)
- 28 - పక్కటెముకలు (Ribs)
- మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉండే 'కర్ణాంతరాస్థి' (Stapes).
ఎముక విరుపు
ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
ఎముక విరుపులోని రకాలు
- సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture): ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొంత భాగం విరగవచ్చును. విరిగిన చోట చర్మంపై ఎలాంటి గాయం కనిపించదు.
- చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture): ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో బయటికి గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
- జటిలమైన ఎముక విరుపు (Complicated fracture): ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు దానికి సమీపంలోని ముఖ్య అవయవాలైన రక్తనాళాలు, నరాలు, కాలేయం, మెదడు, లేదా పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
- లేత ఎముక విరుపు (Greenstick fracture): ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా (మెత్తగా) ఉండే చిన్నపిల్లల ఎముకలలో మాత్రమే కనిపిస్తుంది.
ఎముక విరుపును గుర్తించడం
- ఎముక విరిగిన చోట తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేరు.
- విరిగిన చోట చుట్టూ వాపు ఉంటుంది.
- విరిగిన శరీర భాగాన్ని మామూలుగా కదల్చలేరు.
- విరిగిన చోట కదిపితే ఎముకలు రాసుకున్న శబ్దం వస్తుంది లేదా స్పర్శకు తెలుస్తుంది.
- చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. విరిగిన ఎముకల కొనలను కండరాలు లాగడం వలన ఆ భాగం పొట్టిగా అవుతుంది.
ఎముక విరుపుకు ప్రథమ చికిత్స
- ప్రమాదం జరిగిన చోటనే వీలైనంత త్వరగా ప్రథమ చికిత్స చేయాలి.
- రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి, రక్తం పోకుండా అరికట్టాలి.
- విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు (Splints) ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు.
- ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే దగ్గరలోని వైద్యుని (Orthopedist) వద్దకు తీకుకొని వెళ్ళాలి.
- ఆరోగ్యకరమైన పోషకాహారం (క్యాల్షియం, విటమిన్-డి ఉన్నవి) తీసుకోవడం, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా మన ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.
ఎముకల వ్యాధులు
- బోలు ఎముకల వ్యాధి (Osteoporosis): ముసలితనం, కాల్షియం, విటమిన్-డీ లోపం, మరియు లైంగిక హార్మోన్ల మార్పుల వల్ల ఎముకలు గుల్లబారి, పెళుసుగా తయారవుతాయి. వీరిలో కొత్త ఎముక కణజాలం తయారవటానికన్నా ముందే పాత ఎముక త్వరత్వరగా క్షీణిస్తుంటుంది. దీనివల్ల చిన్న దెబ్బలకే ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది.
- రికెట్స్ (Rickets): ముఖ్యంగా పిల్లలలో విటమిన్-డి లోపం వల్ల ఎముకలు మెత్తబడిపోయి వంగిపోతాయి.
- ఎముకల క్యాన్సర్ (Bone cancer): ఎముక కణాలలో అసాధారణ పెరుగుదల వల్ల వచ్చే క్యాన్సర్.
- కీళ్ల వాతం (Arthritis): కీళ్ల మధ్యలో ఉండే మృదులాస్థి అరిగిపోవడం వల్ల ఎముకలు ఒకదానికొకటి రాసుకుని విపరీతమైన నొప్పి వస్తుంది.
బయటి లింకులు
- Educational resource materials (including animations) by the American Society for Bone and Mineral Research
- Review (including references) of piezoelectricity and bone remodelling
- A good basic overview of bone biology from the Science Creative Quarterly
