భౌతిక భూగోళశాస్త్రంలో, టండ్రా అనేది అతిశీతల ఉష్ణోగ్రతలు, తక్కువ పెరుగుదల కాలాల వల్ల చెట్ల పెరుగుదల నిరోధించబడే ఒక రకమైన బయోమ్. టండ్రాలో మూడు ప్రాంతాలు, వాటికి సంబంధించిన రకాల టండ్రాలు ఉన్నాయి. అవి - ఆర్కిటిక్, ఆల్పైన్, అంటార్కిటిక్.
టండ్రా వృక్షజాలంలో పొట్టి పొదలు, సెడ్జ్‌లు, గడ్డి, పచ్చిక, లైకెన్లు ఉంటాయి. కొన్ని టండ్రా ప్రాంతాల్లో చెట్లు చెదురుమదురుగా పెరుగుతాయి. టండ్రా, అటవీ ప్రాంతాల మధ్యనున్న పర్యావరణ సరిహద్దును ట్రీ లైన్ లేదా టింబర్‌లైన్ అంటారు. టండ్రా నేలలో నత్రజని, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. శాశ్వత మంచు పొరల్లో నిల్వై ఉన్న జీవపదార్థం, కుళ్లిపోయిన జీవపదార్థం కూడా ఈ నేలలో విస్తారంగా ఉంటాయి. వీటిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌లు పెద్ద మొత్తాల్లో బంధించబడి ఉండటంతో టండ్రా నేల కార్బన్ నిల్వ కేంద్రంలా పనిచేస్తుంది. ప్రపంచ ఉష్ణవాతావరణం పెరగడంతో ఈ పర్యావరణ వ్యవస్థ వేడెక్కి నేల కరుగుతుంది. దాంతో శాశ్వత మంచు పొరల్లో జరిగే కార్బన్ చక్రం వేగం పెరిగి, నేలలో బంధించబడి ఉన్న గ్రీన్‌హౌస్ వాయువులు భారీగా వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇది తిరిగి వాతావరణ మార్పును మరింత వేగవంతం చేసే ప్రతిచర్య చక్రాన్ని సృష్టిస్తుంది.
వ్యుత్పత్తి
ఈ పదం రష్యన్ పదం "ту́ндра" ( టండ్రా) నుండి వచ్చింది. ఆంగ్లంలో టండ్రాను మొదటిసారిగా 1824లో "toundra" అని ఉపయోగించారు, ఇది బహుశా ఫ్రెంచ్ నుండి స్వీకరించబడిందని సూచిస్తుంది. రష్యన్ పదం యొక్క మూలం అనిశ్చితంగా ఉంది: ఇది 16వ శతాబ్దానికి చెందిన "тундар" ( టుండార్) అనే పదం నుండి స్వీకరించబడి ఉండవచ్చు, ఇది సామీ భాషా కుటుంబంలో " కొండ ", "ఎత్తైన బంజరు భూమి" లేదా "చిత్తడి మైదానం" అని అర్థం. కొన్ని ఆధారాలు దీని మూలాన్ని ఫిన్నిష్‌కు ఆపాదిస్తాయి..
ఆర్కిటిక్




ఆర్కిటిక్ టండ్రా సుదూర ఉత్తరార్ధగోళంలో ( ఆర్కిటిక్), టైగా బెల్ట్‌కు ఉత్తరాన ఉంటుంది. "టండ్రా" అనే పదం సాధారణంగా భూగర్భంలోని నేల శాశ్వతంగా గడ్డకట్టి ఉండే ప్రాంతాలను మాత్రమే సూచిస్తుంది. (ఇది సాధారణంగా చెట్లు లేని మైదానాన్ని కూడా సూచించవచ్చు.) పెర్మాఫ్రాస్ట్ టండ్రాలో ఉత్తర రష్యా, కెనడాలోని విస్తారమైన ప్రాంతాలు ఉన్నాయి. ధ్రువ టండ్రా అనేక జాతుల ప్రజలకు నిలయం, వీరు ఎక్కువగా సంచార రైన్‌డీర్ కాపరులు, ఉదాహరణకు పెర్మాఫ్రాస్ట్ ప్రాంతంలోని న్గానసన్, నెనెట్స్ (సాప్మిలోని సామి).
ఆర్కిటిక్ టండ్రాలో కఠినమైన ప్రకృతి దృశ్యాలు గల ప్రాంతాలు ఉన్నాయి. సంవత్సరంలో చాలా కాలం పాటు ఇవి గడ్డకట్టి ఉంటాయి. అక్కడి నేల 25 to 90 cm (10 to 35 in) గడ్డకట్టి ఉంటుంది. లోతుగా ఉండటం వలన అక్కడ చెట్లు పెరగడం అసాధ్యం. బీడుపడి, కొన్నిసార్లు రాతి నేలలు నాచు, హీత్ (క్రోబెర్రీ, బ్లాక్ బేర్‌బెర్రీ వంటి ఎరికేసియే రకాలు), లైకెన్ వంటి కొన్ని రకాల ఆర్కిటిక్ వృక్షజాలం మాత్రమే ఇక్కడ పెరుగుతాయి.
ధ్రువ టండ్రాలో ప్రధానంగా రెండు ఋతువులు ఉంటాయి — శీతాకాలం, వేసవి. శీతాకాలంలో తీవ్రమైన చలి, చీకటి, గాలులు ఉంటాయి. సగటు ఉష్ణోగ్రత −28 °C వరకు పడిపోతుంది; కొన్ని సందర్భాల్లో −50 °C వరకూ చేరుతుంది. అయితే టండ్రాలో నమోదయ్యే చలి, దక్షిణాన ఉన్న టైగా ప్రాంతాల తీవ్ర చలికంటే కొంత తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు రష్యా, కెనడా, అలాస్కా అత్యల్ప ఉష్ణోగ్రతలు ట్రీ లైన్ దక్షిణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. వేసవిలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కాలానుగుణంగా గడ్డకట్టిన పైభాగం కరుగుతుండటంతో నేల బురదమయంగా మారుతుంది. వేడి నెలల్లో టండ్రా ప్రాంతం చెరువులు, సరస్సులు, బోగ్‌లు, ప్రవాహాలతో నిండిపోతుంది. వేసవిలో పగటి ఉష్ణోగ్రత సాధారణంగా 12 °C వరకు చేరుతుంది; కొన్ని సందర్భాల్లో 3 °C లేదా అంతకంటే తక్కువకూ పడిపోతుంది. ఆర్కిటిక్ టండ్రా ప్రాంతాలు కొన్ని సార్లు జీవావరణ పరిరక్షణ కార్యక్రమాల కేంద్రమవుతాయి. కెనడా, రష్యాలోని అనేక ప్రాంతాలు జాతీయ జీవవైవిధ్య ప్రణాళికల కింద రక్షణ పొందుతున్నాయి.
ఆర్కిటిక్ టండ్రాలో గాలులు బలంగా వీస్తుంటాయి. గంటకు 50–100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం సాధారణం. ఇది ధ్రువ ఎడారి కూడా; సంవత్సరానికి కేవలం 150–250 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. ఎక్కువ వర్షం సాధారణంగా వేసవిలో పడుతుంది. వర్షపాతం తక్కువైనా, ఆవిరీభవనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో శాశ్వత మంచు పొర కొంతవరకే కరుగుతుంది; అంతవరకే మొక్కలు పెరిగి సంతానోత్పత్తి చేస్తాయి. కానీ దిగువభాగం ఇంకా గడ్డకట్టే ఉండటంతో నీరు లోతుకు జొరబడదు. ఫలితంగా వేసవిలో సరస్సులు, బురద నేలలు ఏర్పడతాయి. వృక్షజాలం, భూభాగ స్వభావాన్ని బట్టి ఇంధన పదార్థాల పేరుకుపోవడం, అగ్నిప్రమాదాల చక్రం మారుతూ ఉంటుంది. అలాస్కాలో జరిగిన పరిశోధనల ప్రకారం అడవి అగ్నిప్రమాదాలు సాధారణంగా 150 నుంచి 200 ఏళ్ల మధ్య వ్యవధిలో పునరావృతమవుతాయి; పొడి లోయప్రాంతాలు, తడిగా ఉండే ఎత్తయిన ప్రాంతాలకంటే ఎక్కువగా దగ్ధమవుతాయి.
టండ్రాలో జీవవైవిధ్యం చాలా తక్కువ. అక్కడ కేవలం 1,700 రకాల నాళికా మొక్కలు, 48 రకాల భూమిపై నివసించే స్తన్యజీవులు మాత్రమే కనిపిస్తాయి. అయితే ప్రతి సంవత్సరం లక్షలాది పక్షులు అక్కడి చెరువుల కోసం వలస వెళ్తాయి. కొకొన్ని చేపల జాతులు కూడా ఉంటాయి. పెద్ద సంఖ్యలో కనిపించే జీవజాతులు మాత్రం చాలా తక్కువ.
ఆర్కిటిక్ టండ్రాలో ముఖ్యంగా బ్లూబెర్రీ, క్రోబెర్రీ, రెయిన్‌డీర్ లైకెన్, లింగన్‌బెర్రీ, లాబ్రడార్ టీ మొక్కలు పెరుగుతాయి. ముఖ్య జంతువుల్లో రెయిన్‌డీర్ (కారిబూ), మస్క్ ఆక్స్, ఆర్కిటిక్ కుందేలు, ఆర్కిటిక్ నక్క, మంచు గుడ్లగూబ, ప్టార్మిగన్, ఉత్తర ఎర్ర వెన్నెల ఎలుకలు, లెమ్మింగ్స్, దోమలు, సముద్రతీరాల దగ్గర ధ్రువపు ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. బయట వాతావరణం ఆధారంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే కప్పలు, బల్లుల వంటి జీవులు టండ్రాలో దాదాపు కనిపించవు.
ఆర్కిటిక్ టండ్రా కఠిన వాతావరణం వల్ల అక్కడ మానవ కార్యకలాపాలు చాలాకాలం తక్కువగానే ఉండేవి. అయినప్పటికీ అక్కడ పెట్రోలియం, సహజ వాయువు, యురేనియం సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో అలాస్కా, రష్యా తదితర ప్రాంతాల్లో పరిస్థితి మారుతోంది. ఉదాహరణకు యమాలో-నేనెట్స్ స్వయంప్రతిపత్తి ప్రాంతం నుండి రష్యా సహజ వాయువు ఉత్పత్తిలో 90% వస్తోంది.
వాతావరణ మార్పుతో సంబంధం
టండ్రాకు ఎదురవుతున్న అత్యంత తీవ్రమైన ప్రమాదాల్లో వాతావరణ మార్పు ప్రధానమైనది. దీని వల్ల శాశ్వత మంచు పొరలు కరుగుతున్నాయి. మనుషుల కాలమానంలో — అంటే కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాల వ్యవధిలో — ఒక ప్రాంతంలోని శాశ్వత మంచు పూర్తిగా కరిగిపోతే, అక్కడ ఏ జీవజాతులు బతకగలవో అన్నది పూర్తిగా మారిపోవచ్చు. ఇది పెర్మాఫ్రాస్టు పైన నిర్మించిన రహదారులు, పైప్‌లైన్లు వంటి మౌలిక సదుపాయాలకు కూడా ఇది పెద్ద ప్రమాదంగా మారుతుంది.
చనిపోయిన మొక్కలు, పీట్ పొరలు పేరుకుపోయిన ప్రాంతాల్లో అడవి అగ్నిప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2007లో అలాస్కాలోని బ్రూక్స్ శ్రేణి ఉత్తర వాలుదారుల్లో 1,039 చ.కి.మీ. విస్తీర్ణం గల టండ్రా అగ్నికి ఆహుతైంది. ఇలాంటి ఘటనలు గ్లోబల్ వార్మింగు వలన ఏర్పడతాయి. అదే సమయంలో దానిని మరింత వేగవంతం చేస్తాయి కూడాను.
శాశ్వత మంచు కరుగుదల వల్ల విడుదలయ్యే కార్బన్ వాయువులు, ఆ కరుగుదలకే కారణమైన వేడిమిని మరింత పెంచుతాయి. అందువల్ల ఇది వాతావరణ మార్పులో “ధనాత్మక ప్రతిచర్య చక్రం”గా పనిచేస్తుంది. పెరుగుతున్న వేడి కారణంగా ఆర్కిటిక్ ప్రాంత జలచక్రం కూడా తీవ్రమవుతోంది. ఎక్కువ మొత్తంలో పడే వేడి వర్షాలు శాశ్వత మంచు మరింత లోతువరకు కరుగడానికి మరో కారణంగా మారుతున్నాయి.
ఐపీసీసీ ఆరో అంచనా నివేదిక ప్రకారం, శాశ్వత మంచు కరుగుదల వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాయువులు ప్రతి 1 °C ఉష్ణోగ్రత పెరుగుదలకు 14 నుంచి 175 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమాన ప్రభావం చూపవచ్చు. పోల్చిచూడాలంటే, 2019 నాటికి మానవ కార్యకలాపాల వల్ల ప్రతి ఏడాది విడుదలైన కార్బన్ డయాక్సైడ్ పరిమాణం సుమారు 40 బిలియన్ టన్నులు. 2018లో ప్రచురితమైన ఒక పరిశోధనా వ్యాసం ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతలు సుమారు 2 °C పెరిగితే వాతావరణ వ్యవస్థలో కీలక మార్పులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ స్థాయిలో శాశ్వత మంచు కరుగుదల మాత్రమే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలకు అదనంగా సుమారు 0.09 °C పెరుగుదలను కలిగించవచ్చని అంచనా వేసింది. ఈ అంచనా పరిధి 0.04 °C నుంచి 0.16 °C వరకు ఉండవచ్చని తెలిపింది.
అంటార్కిటిక్

అంటార్కిటిక్ టండ్రా అంటార్కిటికా ఖండంలోనూ, దానికి సమీపంలోని కొన్ని అంటార్కిటిక్, ఉప-అంటార్కిటిక్ దీవుల్లోనూ కనిపిస్తుంది. వీటిలో సౌత్ జార్జియా, సౌత్ సాండ్‌విచ్ దీవులు, కెర్గుయెలెన్ దీవులు ముఖ్యమైనవి. అంటార్కిటికా ఎక్కువభాగం తీవ్రమైన చలి, పొడిబారిన వాతావరణం కారణంగా వృక్షజీవనానికి అనుకూలంగా ఉండదు. ఖండంలో అధికభాగం మంచు మైదానాలు లేదా చల్లని ఎడారులతో కప్పబడి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అంటార్కిటిక్ ద్వీపకల్పంలో, రాళ్లతో కూడిన నేలపై మొక్కలు పెరుగుతాయి. ప్రస్తుతం అక్కడ సుమారు 300–400 రకాల లైకెన్లు, 100 రకాల నాచు మొక్కలు, 25 రకాల లివర్‌వోర్ట్లు, దాదాపు 700 రకాల భూ, జల శైవలాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తీర ప్రాంతాల్లో బయటపడిన రాళ్లు, నేలలపై జీవిస్తాయి. అంటార్కిటికాలో పుష్పించే మొక్కలు కేవలం రెండే — అంటార్కిటిక్ హెయిర్ గ్రాస్, అంటార్కిటిక్ పెర్ల్‌వోర్ట్. ఇవి ప్రధానంగా అంటార్కిటిక్ ద్వీపకల్పం ఉత్తర, పశ్చిమ భాగాల్లో కనిపిస్తాయి.
ఆర్కిటిక్ టండ్రాతో పోలిస్తే అంటార్కిటిక్ టండ్రాలో పెద్ద స్తన్యజీవులు దాదాపు లేరు. ఇతర ఖండాల నుంచి భౌగోళికంగా వేరుపడటం దీనికి ప్రధాన కారణం. తీర ప్రాంతాల వద్ద సీల్స్, పెంగ్విన్లు వంటి సముద్ర జీవులు, సముద్ర పక్షులు నివసిస్తాయి. కొన్ని ఉప-అంటార్కిటిక్ దీవుల్లో మనుషులు కుందేళ్లు, పిల్లులు వంటి చిన్న జంతువులను ప్రవేశపెట్టారు.
ఆంటిపోడ్స్ ఉప-అంటార్కిటిక్ దీవుల టండ్రా అనే పర్యావరణ ప్రాంతంలో బౌంటీ దీవులు, ఆక్‌లాండ్ దీవులు, ఆంటిపోడ్స్ దీవులు, కాంప్‌బెల్ దీవులు, మాక్వారీ దీవులు ఉన్నాయి.[22] ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన జీవజాతుల్లో విండ్స్‌వెప్ట్ హెల్మెట్ ఆర్కిడ్ (Corybas dienemus), గ్రూవ్డ్ హెల్మెట్ ఆర్కిడ్ (Corybas sulcatus), రాయల్ పెంగ్విన్, ఆంటిపోడియన్ ఆల్బట్రాస్ ఉన్నాయి.
పటగోనియా పశ్చిమ తీరంలోని మగెల్లానిక్ మూర్‌ల్యాండ్ ప్రాంతాన్ని టండ్రాగా పరిగణించాలా వద్దా అన్న విషయంలో కొంత భేదాభిప్రాయం ఉంది.అయితే ఇటీవలి అధ్యయనాలు దానిని సమశీతోష్ణ గడ్డి భూమిగా వర్గీకరించాయి; దక్షిణ టండ్రాను తీర ప్రాంత అంటార్కిటికా, దాని దీవులకే పరిమితం చేశాయి. చిలీ వృక్షభూగోళ శాస్త్రవేత్త ఎడ్ముండో పిసానో, తక్కువ ఉష్ణోగ్రతలే మొక్కల పెరుగుదలను నియంత్రిస్తున్నాయని భావించి దానిని “మగెల్లానిక్ టండ్రా”గా పేర్కొన్నారు అయితే ఇటీవలి అధ్యయనాలు దానిని సమశీతోష్ణ గడ్డి భూమిగా వర్గీకరించాయి; దక్షిణ టండ్రా, తీర ప్రాంత అంటార్కిటికా, దాని దీవులకే పరిమితమైంది.
దక్షిణ అక్షాంశం 60° కంటే దిగువనున్న అంటార్కిటికా, అంటార్కిటిక్ దీవుల వృక్షజాలం, జంతుజాలం అన్నీ అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థ కింద రక్షణ పొందుతున్నాయి.
ఆల్పైన్

ఆల్పైన్ టండ్రాలో చెట్లు ఉండవు. అధిక ఎత్తు ప్రాంతాల్లో ఉండే వాతావరణం, నేల స్వభావాలు చెట్ల పెరుగుదలను అడ్డుకుంటాయి. అక్కడి చల్లని వాతావరణం ప్రధానంగా తక్కువ గాలి ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడుతుంది; ఇది ధ్రువ వాతావరణాన్ని పోలి ఉంటుంది. ఆల్పైన్ టండ్రా నేలలు సాధారణంగా ఆర్కిటిక్ నేలలకంటే మెరుగైన నీటి పారుదల కలిగి ఉంటాయి. ట్రీ లైన్ కింద భాగంలో ఆల్పైన్ టండ్రా ఉప-ఆల్పైన్ అటవీ ప్రాంతాలకు మారుతుంది. అటవీ-టండ్రా సరిహద్దులో పెరిగే పొట్టిగా, వంకరగా ఉండే అడవులను “క్రుమ్‌హోల్జ్” అంటారు. ఆల్పైన్ టండ్రాలో కలప మొక్కలు విస్తరించే ప్రభావం కూడా కనిపించవచ్చు.
ఆల్పైన్ టండ్రా ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. అక్కడి వృక్షజాలంలో నేలకు దగ్గరగా పెరిగే బహువార్షిక గడ్డిజాతులు, సెడ్జ్ మొక్కలు, పుష్పించే చిన్న మొక్కలు, దిండు ఆకారపు మొక్కలు, మాస్ మొక్కలు, లైకెన్లు ప్రధానంగా ఉంటాయి. ఈ మొక్కలు తీవ్రమైన చలి, పొడిబారిన వాతావరణం, అతినీలలోహిత కిరణాలు, తక్కువ పెరుగుదల కాలం వంటి కఠిన పరిస్థితులకు అనుగుణంగా మారిపోయాయి.
వాతావరణ వర్గీకరణ

టండ్రా శీతోష్ణస్థితులు సాధారణంగా కోపెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ET కి సరిపోతాయి. మంచు కరగడానికి సరిపడేంత అధిక సగటు ఉష్ణోగ్రత ( 0 °C (32 °F)) కనీసం ఒక నెలపాటు ఉండే స్థానిక శీతోష్ణస్థితిని ఇది సూచిస్తుంది. కానీ సగటు ఉష్ణోగ్రత 10 °C (50 °F) మించి ఉండే నెల ఉండదు. శీతల పరిమితి సాధారణంగా శాశ్వత మంచు హిమంతో కూడిన EF వాతావరణాలను కలుస్తుంది; వెచ్చని-వేసవి పరిమితి సాధారణంగా చెట్ల యొక్క ధ్రువ లేదా ఎత్తు పరిమితికి అనుగుణంగా ఉంటుంది, అక్కడ అవి Dfd, Dwd, Dsd (సైబీరియాలోని కొన్ని ప్రాంతాలలో వలె తీవ్రమైన శీతాకాలాలు), అలాస్కా, కెనడా, స్కాండినేవియాలోని పర్వత ప్రాంతాలు, యూరోపియన్ రష్యా, పశ్చిమ సైబీరియాలో సాధారణంగా కనిపించే Dfc (నెలల తరబడి గడ్డకట్టే చల్లని శీతాకాలాలు) అని పిలువబడే ఉప ఆర్కిటిక్ వాతావరణాలుగా మారుతాయి.
